రంగనాథుడు అలా ఆవిర్భవించాడు
శ్రీమహావిష్ణువు అనేక క్షేత్రాలలో రంగనాథస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన ఒక్కో క్షేత్రం వెనుక ఒక విశేషం వినిపిస్తూ వుంటుంది. అది స్వామి మహిమకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీరంగాపురం' దర్శనమిస్తుంది.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం, మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగొందుతోంది. భారీ రాజగోపురం .. పొడవైన ప్రాకారాలు .. సువిశాలమైన ప్రాంగణం కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారు శయన ముద్రలో దర్శనమిస్తూ వుంటాడు. తన దర్శన మాత్రం చేతనే పాపాలు నశింపజేసి పుణ్య ఫలాలను ప్రసాదిస్తూ వుంటాడు.
అలాంటి ఈ స్వామి .. వనపర్తి సంస్థానాధీశుడికి స్వప్నంలో కనిపించి తన జాడ తెలిపాడట. ఫలానా చోట నిక్షిప్తమై వున్న తన మూర్తిని వెలికితీయమని ఆదేశించాడట. గరుడ పక్షి దారి చూపుతుందనీ, దానిని అనుసరిస్తూ వెళ్లి .. అది వాలిన ప్రదేశంలో ఆ మూర్తిని ప్రతిష్ఠించమని చెప్పాడట. అలా ఆ పక్షిని అనుసరించిన ఆయన, అది ఈ ప్రదేశంలో వాలగా .. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. స్వామివారు స్వయంగా తరలిరావడం వలన, ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు భావిస్తుంటారు. అంకితభావంతో ఆ స్వామిని సేవించి తరిస్తుంటారు.