ర్యాలి క్షేత్రానికి అందుకే ఆ పేరు వచ్చిందట!
శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం ధరించిన రూపాలలో జగన్మోహిని రూపం ఒకటి. దేవతల నుంచి అమృతాన్ని దక్కించుకోవడానికి అసురులు ప్రయత్నిస్తూ వుండగా, వాళ్లకి అమృత భాండం చిక్కకుండా చేయడం కోసం స్వామి జగన్మోహిని రూపాన్ని ధరించాడు. అలా స్వామి తాను అనుకున్న కార్యాన్ని పూర్తిచేసిన తరువాత, పరమశివుడి కంటపడతాడు.
జగన్మోహిని సౌందర్య విశేషం సదాశివుడిని ఆశ్చర్యచకితుడిని చేస్తుంది. విష్ణు మాయ కారణంగా ఆకర్షితుడైన శివుడు .. జగన్మోహినిని అనుసరిస్తాడు. ఆయన వెంబడిస్తుండటం గమనించిన జగన్మోహిని తన నడక వేగాన్ని పెంచుతుంది. అలా హడావిడిగా ఆమె వెళుతూ వుండగా ఆమె తలలో తురుముకున్న పుష్పం ఒకటి ' రాలి' పడిపోతుంది.
లోక కల్యాణం కోసం వచ్చిన జగన్మోహిని తలలోని పుష్పం 'రాలి' పడిన ప్రదేశం కనుక, ఈ ప్రదేశానికి 'ర్యాలి' అనే పేరు వచ్చిందననేది ఒక కథగా చెబుతారు. ఒకే మూలమూర్తికి ముందు భాగంలో కేశవస్వామి దర్శనమిస్తూ ఉండగా, వెనుక భాగంలో జగన్మోహిని రూపం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, విశేషమైన ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.