సురుటుపల్లికి అందుకే ఆ పేరు!
పరమశివుడు కొలువైన క్షేత్రం .. ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం 'సురుటుపల్లి'. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది. సాధారణంగా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమహా విష్ణువు మాత్రమే శయనభంగిమలో దర్శనమిస్తుంటాడు. శివుడు మాత్రం లింగరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
సదాశివుడు కూడా శ్రీమహా విష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే 'సురుటు పల్లి'. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. ఈ సంఘటన కారణంగా కోటి మంది దేవతలు అక్కడికి చేరుకున్నారు.
లోక కల్యాణం కోసం కోటి మంది దేవతలు తరలి వచ్చిన ప్రదేశం కనుక 'సురకోటి పల్లి'గా పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా 'సురుటు పల్లి'గా మారిందని చెబుతుంటారు. ఇక సదాశివుడు ఇక్కడ పడుకుని దర్శనమిస్తూ ఉంటాడు కనుక, 'పళ్లికొండేశ్వర స్వామి'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన సమస్త దేవతలను దర్శించిన ఫలితం కలుగుతుందని చెబుతుంటారు. ఆపదల నుంచి ఆ స్వామి గట్టెక్కిస్తూ ఉంటాడని విశ్వసిస్తుంటారు.