అలా స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు
లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన ప్రాచీన ఆలయాలు ఎక్కువగా కొండలపైన .. గుట్టలపైన కనిపిస్తుంటాయి. అయినా భక్తులు శ్రమను లెక్కచేయకుండా కొండలపైకి చేరుకుంటూనే వుంటారు .. ఆ స్వామివారిని సేవిస్తూనే వుంటారు. స్వామివారు అక్కడ కొలువైనదే భక్తుల కోసం కనుక, వాళ్లచే పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తుంటాడు.
అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా తూర్పుగోదావరి జిల్లాలోని 'కోరుకొండ' కనిపిస్తుంది. స్వామివారు వెలసిన ఈ కొండను చూడగానే ఇది మహిమాన్వితమైనదనే విషయం అర్థమైపోతుంది. ఈ కొండను 'పరాశర కొండ' అని కూడా పిలుస్తుంటారు. కృతయుగంలో పరాశర మహర్షి ఈ కొండపై స్వామివారి సాక్షాత్కారం కోసం తపస్సును చేశాడట.
పరాశర మహర్షి తపస్సుకి మెచ్చిన స్వామి ఆయనకి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు. భూలోకవాసులను తరింపజేయడానికి ఈ కొండపైనే కొలువుదీరవలసిందిగా స్వామిని ఆ మహర్షి కోరాడు. ఆయన కోరికమేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. పరాశర మహర్షి కోరిక మేరకు స్వామి ఈ కొండపై వెలిశాడు కనుక, దీనిని 'పరాశర కొండ' అని పిలుస్తుంటారు. అనునిత్యం ఆ స్వామిని అంకితభావంతో కొలుస్తుంటారు.