సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి

జీవితంలో ప్రతి ఒక్కరూ సంపదకి అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ధనం వలన అన్ని అవసరాలు తీరకపోవచ్చునేమో గానీ, అత్యవసరమైన కొన్ని పనులు మాత్రం చక్కబడతాయి. అవసరాల్లోను .. ఆపదల్లోను ధనమనేది సాయపడుతుంది. అందువలన ధనం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడుతుంటారు. ఆ విషయంలో తమకి కొరత లేకుండా చూసుకుంటూ వుంటారు.

ధనాన్ని సంపాదించాలన్నా .. ఆ ధనం నిలవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిందే. ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందాలంటే భక్తి శ్రద్ధలు .. అంకిత భావం ఉండాల్సిందే. అలాంటి ఆరాధనా భావంతో అమ్మవారి ఆలయాలు నిర్మించబడిన క్షేత్రాలు ఎన్నో వున్నాయి. అలాంటి వాటిలో కృష్ణా జిల్లా తిరువూరు ఒకటిగా కనిపిస్తుంది.

ఇక్కడ అష్టలక్ష్మీదేవి ఆలయం అలరారుతోంది. ప్రధానమైన ఆలయంలో శ్రీమహాలక్ష్మీదేవి పూజలు అందుకుంటూ వుండగా, సువిశాలమైన ప్రాంగణంలోని ఏడు మందిరాల్లో మిగతా అమ్మవార్లు కొలువుదీరి వుంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టాదశ భుజాలతో దర్శనమిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి శుక్రవారం అమ్మవారిని సేవించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని పూజించడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోయి, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News