ఆపదలను తొలగించే వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామిని ఆపద మొక్కులవాడిగా భక్తులు కొలుస్తుంటారు. ఆపదలో వున్నప్పుడు ఆ స్వామిని వేడుకోవడం వలన, ఆయనకి మొక్కుకోవడం వలన ఆపదల నుంచి బయటపడటం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తుంటాయి. అలా అనునిత్యం భక్తులచే పూజలందుకునే క్షేత్రాలలో ఒకటిగా నల్గొండ జిల్లాలోని బీబీ నగర్ కనిపిస్తుంది.
ఇక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయం కుదురుగా దర్శనమిస్తుంది. అనునిత్యం ఆ స్వామిని దర్శించుకోవాలనే సంకల్పంతో, భక్తులంతా కలిసి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. గర్భాలయంలో స్వామివారి మూర్తి నిలువెత్తున నిండుగా కనిపిస్తుంది. దివ్యమైన తేజస్సుతో ఈ మూర్తి వెలుగొందుతూ, భక్తులు చూపును మరల్చుకోనివ్వకుండా చేస్తుంది. ఇదే ప్రాంగణంలో శ్రీదేవి - భూదేవి మందిరాలు ప్రత్యేకంగా దర్శనమిస్తుంటాయి.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అమ్మవార్లని దర్శించుకుని అనుగ్రహాన్ని కోరుతుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన .. పూజించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. ఆపదలో వున్నప్పుడు ఆ స్వామిని స్మరించుకోవడం వలన, వాటి నుంచి గట్టెక్కడం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. స్వామివారి కరుణా కటాక్షాలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తుంటాయి. స్వామివారి మహిమలకు అద్దం పడుతుంటాయి.