ఆదిశేషుడి పూజలందుకునే వేంకటేశ్వరుడు
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషుడిపై పవళిస్తూ ఆయన సేవలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి శ్రీమహావిష్ణువు లోక కల్యాణార్థం శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చినపుడు కూడా, ఆదిశేషుడు ఆయన వెన్నంటి ఉంటూ సేవిస్తూ వస్తున్నాడు. అలా ఆదిశేషుడిచే స్వామివారు పూజలందుకునే పరమ పవిత్రమైన క్షేత్రంగా 'తిరుమలగిరి' కనిపిస్తుంది.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ కొండపై స్వామి ఒక పుట్టలో ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. వ్యాస మహర్షి ఇక్కడ స్వామివారిని సేవించాడని అంటారు. ఇక ఇక్కడ స్వామివారిని ఆదిశేషుడు కనిపెట్టుకుని ఉంటాడని చెబుతారు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఆదిశేషుడు వచ్చి స్వామిని ప్రత్యక్షంగా పూజిస్తాడని అంటారు. ఆయన పూజకి అవసరమైన పూలు .. అక్షితలు .. కుంకుమను .. పాలను అర్చకులు సిద్ధం చేసి వెళతారట.
మరునాడు ఉదయం ఆలయం తలుపులు తెరచి చూస్తే, పూజ చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయట. అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనీ, ఆయనని ఆదిశేషుడు స్వయంగా పూజిస్తాడని విశ్వసిస్తుంటారు. వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని మనసారా దర్శించుకుని ధన్యులవుతుంటారు.