ఆరోగ్యానిచ్చే ఉగాది పచ్చడి
'ఉగాది' అనగా సృష్టి మొదలైన రోజు. చైత్ర శుద్ధ పాడ్యమిగా చెప్పబడే ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టి రచనను ఆరంభించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి .. తల స్నానం చేసి .. కొత్తబట్టలు ధరించాలి. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన 'ఉగాది' పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. తీపి .. చేదు .. ఉప్పు .. కారం .. పులుపు .. వగరు అనే ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
ఈ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించడం వెనుక ఆచారపరమైన కారణమే కాదు, ఆరోగ్యపరమైన అర్థం కూడా ఇమిడి వుంది. ఉగాది నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన శరీరంలోని ఉష్ణోగ్రత కూడా పెరిగిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాటిని ఈ శరీరం తట్టుకుని నిలవడానికి ఉగాది పచ్చడి ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని చెప్పబడుతోంది.
ఉగాది పచ్చడిని వేపపూత .. బెల్లం .. లేత మామిడి ముక్కలు .. ఉప్పు .. చింతపండు .. మిరియాలతో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా వేటికవే విశేషమైన గుణాలను కలిగి వున్నాయి. వీటన్నింటిని కలిపిన ఉగాది పచ్చడిని స్వీకరించడం వలన వాత .. పిత్త .. కఫ దోషాలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, కంటి సంబంధమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. శరీరంలోని ఉష్ణోగ్రతను సమానమైన స్థితిలో వుంచి, ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుతుంది కనుక ఈ రోజున తప్పకుండా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అందువల్లనే పూర్వీకులు ఆరోగ్య సంబంధమైన ఈ విషయాన్ని ఆచారంలో భాగంగా చేశారు.