లక్ష్మీదేవి స్వయంగా తరలివచ్చింది

దైవం ఎప్పుడూ కూడా తనని అంకితభావంతో ఆరాధించే భక్తులను ఓ కంట కనిపెడుతూనే వుంటుంది. వాళ్ల కష్టనష్టాలను తొలగించి, సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. తనని అనునిత్యం స్మరించే భక్తులు తన దర్శనానికి రాలేకపోయినప్పుడు, దైవమే ఆ భక్తుల ఇంటికి తరలివెళ్లిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి పుణ్యస్థలిగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ పట్టణం సమీపంలో గల 'కల్లూరు' కనిపిస్తుంది.

పూర్వం ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడు ప్రతి ఏడాది 'కొల్హాపూర్' వెళ్లి మహాలక్ష్మీదేవిని దర్శనం చేసుకుని వచ్చేవాడట. వయసుపైబడిన కారణంగా ఆ ఏడాది ఆయన అక్కడికి వెళ్లలేక చాలా బాధపడుతున్నాడట. అతని బాధను తొలగించడం కోసం అమ్మవారు స్వప్న దర్శనం ఇవ్వడమే కాకుండా, ఆ ఇంట్లోని సానరాయిని తన మూర్తిగా మార్చి అక్కడ కొలువుదీరింది. ఇక ఆ భక్తుడి ఆనందానికి అవధులు లేవు.

అదే సమయంలో ఆ ఊళ్లోని ఒక రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా వేంకటేశ్వర స్వామి మూర్తి వెలుగుచూసింది. ఈ సంఘటనను దైవ సంకల్పంగా భావించి, లక్ష్మీదేవి విగ్రహం పక్కనే వేంకటేశ్వరస్వామి మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ మూర్తులను చూడగానే, అవి మహిమాన్వితమైనవనే విషయం అర్థమవుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించు కోవడం వలన కలిగే ఫలితాలు, భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూనే వుంటాయి. అయ్యవారు .. అమ్మవారు స్వయంభువులుగా ఆవిర్భవించిన క్షేత్రం కనుక, భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ .. మహిమాన్వితమైన క్షేత్రంగా వెలుగొందుతోంది.


More Bhakti News