అదే ఈ క్షేత్రం ప్రత్యేకత
వేణుగోపాలస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'పెడన' ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలోని ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా ఇది అలరారుతోంది. ఈ గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు ఆ సమీపంలోనే శివాలయం కూడా దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడ శివుడిని 'అగస్త్యేశ్వరుడు'గా భక్తులు ఆరాధిస్తుంటారు. ఇలా ఈ గ్రామం శివకేశవ క్షేత్రంగా వెలుగొందుతోంది.
ఈ క్షేత్రం గురించి ఇక్కడ ఒక విశేషం వినిపిస్తూ వుంటుంది. వేణుగోపాలుడు .. బాలకృష్ణుడుగా ఇక్కడ తిరుగాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అప్పుడప్పుడు ఆలయంలో బాలకృష్ణుడి పాదాల ముద్రలు కనిపించడమే ఇందుకు కారణమని చెబుతారు. ఒక్కోసారి స్వామి స్నానం ఆచరించి తడి పాదాలతో నడచిన గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయని అంటారు.
అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని చెబుతారు. తమ కోరికలను నెరవేర్చే కల్పవృక్షంగా ఆయనని కొలుస్తుంటారు. ధనుర్మాసంలోను .. కృష్ణాష్టమి .. ముక్కోటి వంటి పర్వదినాల్లోను స్వామికి ప్రత్యేక పూజలు .. సేవలు నిర్వహిస్తుంటారు. ఆ స్వామి కరుణా కటాక్షాలు సదా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు.