స్వామియే తన జాడ తెలిపిన వైనం

ఏదో ఒక కారణంగా భగవంతుడి అర్చామూర్తి రూపాలు మరుగున పడిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో స్వామియే భక్తులకు తన జాడ తెలిపిన వైనం కొన్ని క్షేత్రాల్లో కనిపిస్తుంది. అలాంటి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి 'కొంకేపూడి'లో అలరారుతోంది. కృష్ణ జిల్లా 'పెడన' మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ చెన్నకేశవస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

అయితే ఒకప్పుడు ఈ క్షేత్రంలో గోపాలస్వామి పూజలు అందుకుంటూ ఉండేవాడట. అలా ఇక్కడి ప్రజలంతా స్వామిని ఆరాధిస్తూ వుండగా, మతపరమైన దాడులు జరిగాయి. ఆ దాడుల్లో గోపాలస్వామి విగ్రహం దెబ్బతినడంతో, పూజారితో సహా గ్రామస్తులంతా బాధపడసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఆలయ పూజారికి గోపాలస్వామి కలలో కనిపించి, తాను చెన్నకేశవస్వామిగా ఫలానా ప్రదేశంలో ఉన్నానని చెప్పాడట. అందుకు సంబంధించిన ఆనవాళ్లు చెప్పి, తన మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించి పూజించుకోమని అన్నాడు.

దాంతో మరునాడు ఉదయాన్నే ఆ పూజారి, గ్రామస్తులను వెంటబెట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్లి తవ్విచూడగా, స్వామి మూర్తి బయటపడింది. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోన్న స్వామి మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా వెలుగు చూసిన చెన్నకేశవుడే ఇప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. స్వామి మహిమలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తుంటాయి .. ఆయన లీలావిశేషాలను చాటి చెబుతుంటాయి.


More Bhakti News