ఈ కోనేటి తీర్థాన్ని స్వీకరిస్తే చాలు
ప్రాచీనమైన క్షేత్రాలు .. భగవంతుడి అనుగ్రహంతో అక్కడ ఆవిర్భవించిన తీర్థాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడుతుంటాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి' క్షేత్రం కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం 'గోపాలపల్లి' గ్రామంలో గల కొండపై ఈ స్వామి కొలువై వున్నాడు. స్వామివారి పేరుమీదనే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు.
నల్గొండ జిల్లాలో గల ప్రాచీనమైన క్షేత్రాలలో ఈ వేణుగోపాల స్వామి ఆలయం ముందువరుసలో కనిపిస్తుంది. స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించడం వలన, ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదనీ .. మరెంతో మహిమాన్వితమైనదని చెబుతుంటారు. పూర్వం ఎంతోమంది మునులు ఈ కొండపై స్వామివారిని సేవిస్తూ ఉండేవారని అంటారు.
ఇక్కడ కనిపించే 'మంత్ర బావి'ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. స్వామివారి పాద స్పర్శతో ఇక్కడ జలం ఉబికి వచ్చి కోనేరుగా మారిందని అంటారు. ఈ కోనేరునే 'మంత్ర బావి' అని పిలుస్తుంటారు. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడేవాళ్లు ఈ కోనేటిలోని నీటిని స్వీకరిస్తుంటారు. స్వామివారి పాద తీర్థం కనుక, వెంటనే ఫలితం కనిపిస్తుందని విశ్వసిస్తుంటారు. మంత్రం వేసినట్టుగా ఫలితాన్ని చూపుతుంది కనుక, ఈ కోనేరును 'మంత్ర బావి'గా చెప్పుకుంటూ వుంటారు. రామలింగేశ్వరుడితో కలిసి వేణుగోపాలుడు పూజాభిషేకాలు అందుకునే ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.