తీర్థ ప్రసాదాల స్వీకరణ

ప్రతి ఒక్కరు తమని నడిపించేది భగవంతుడేనని నమ్ముతుంటారు. తమ కష్ట నష్టాలు తీర్చేది ఆయనేనని పరిపూర్ణంగా విశ్వసిస్తుంటారు. అందుకే అనునిత్యం దైవాన్ని పూజిస్తుంటారు .. అంకితభావంతో సేవిస్తుంటారు. ఉదయాన్నే ఆ స్వామిని పూజించి .. ఆయనకి నైవేద్యాలు సమర్పించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తరువాతనే వృత్తిపరమైన కార్యరంగంలోకి దిగుతారు.

ఇక దేవాలయానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ తీర్థప్రసాదాలు స్వీకరించకుండా వెనుదిరగరు. దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు .. వీలైతే అభిషేకం .. అర్చన చేయిస్తారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికలను దైవానికి చెప్పుకుంటారు. పూజ పూర్తయ్యేంత వరకూ వుండి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. భగవంతుడికి చేసిన అభిషేక ద్రవ్యం తీర్థంగా ఇవ్వబడుతుంది. తీర్థం స్వీకరించడం వలన శరీరం .. మనసు పవిత్రమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

తీర్థం తరువాత భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన పదార్థాలను ప్రసాదంగా పంచుతారు. 'ప్రసాదం' అనే సంస్కృత పదానికి 'అనుగ్రహం' అనే అర్థం చెప్పబడుతోంది. అంటే ప్రసాదం తీసుకోవడమనేది భగవంతుడి అనుగ్రహాన్ని అందుకోవడమన్నమాట. మనసును భగవంతుడి పాదాల చెంత శ్రద్ధతో సమర్పించి, అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ తీర్థ ప్రసాదాలను స్వీకరించడం వలన .. దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News