గండాలు గట్టెక్కించే నీలకంఠస్వామి

శివ శివా అని స్మరించినంత మాత్రాన్నే ఆ పరమశివుడు పాపాలను హరించి వేసి, పుణ్యఫలాలను ప్రసాదిస్తుంటాడు. కోరిన వరాలను అనుగ్రహించడంలో స్వామి ఎంత మాత్రం ఆలస్యం చేయడు గనుక, భక్తులు ఆయనని అంకితభావంతో అర్చించి తరిస్తుంటారు. అలా ఆ స్వామి పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాల్లో ఒకటిగా, కర్నూలు జిల్లాలోని 'ఎమ్మిగనూరు' కనిపిస్తుంది. ఇక్కడ స్వామి నీలకంఠుడిగా కొలవబడుతూ ఉంటాడు.

పూర్వం ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ వుండగా, స్వామి లింగరూపంలో వెలుగు చూశాడని చెబుతారు. ఆనాటి నుంచి స్వామిని ఈ ఊరు వాళ్లంతా తమ ఇలవేల్పుగా భావించి సేవిస్తుంటారు. తాము ఏ కార్యాన్ని తలపెట్టినా ఆ స్వామికి చెప్పుకోవడం .. ఆయన అనుగ్రహాన్ని కోరుకోవడం చేస్తుంటారు. ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ స్వామిని తలచుకుంటే చాలు, అవి మబ్బు తెరల్లా తొలగిపోతాయని అంటారు.

తనని విశ్వసించినవారిని ఆ స్వామి ఎలా ఆదుకున్నాడనేది భక్తుల అనుభవాలుగా .. కథలు కథలుగా వినిపిస్తూ వుంటాయి. అందుకే స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనీ .. పిలిస్తే పలుకుతాడని చెబుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక ప్రతి యేటా పుష్యమాసంలో ఈ క్షేత్రంలో జరిగే రథోత్సవానికి భక్తులు అశేష సంఖ్యలో హాజరవుతారు. ఆ సమయంలో ఈ క్షేత్ర వైభవాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు .. ఆ అనుభూతిని పదిలపరచుకోవడానికి ఒక మనసు సరిపోదు.


More Bhakti News