శ్రీమహా విష్ణువుకి పాల నైవేద్యం

శ్రీమహావిష్ణువు లీలా విశేషాలను అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ స్వామి లీలా విశేషాలను తెలుసుకోగలమని బలంగా నమ్మిన వాళ్లను సైతం ఆయన ఆశ్చర్యచకితులను చేసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి స్వామికి ఇష్టమైన మాసాల్లో 'ఫాల్గుణ మాసం' ఒకటిగా చెప్పబడుతోంది.

చాంద్రమానం ప్రకారం 12వ మాసమైన ఫాల్గుణ మాసం శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. స్వామివారికి ఒక్కో మాసంలో .. వివిధ పుణ్యతిథుల్లో ఆయా నైవేద్యాలు ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఫాల్గుణ మాసం విషయానికి వచ్చేసరికి, ఈ మాసంలో స్వామివారికి పాలను నైవేద్యంగా సమర్పించాలని చెప్పబడుతోంది.

ఫాల్గుణ మాసం ఆరంభమైన మొదటి 12 రోజుల పాటు శ్రీమహావిష్ణువును పూజించడం వలన విశేషమైన పుణ్యఫలితాలు కలుగుతాయని అంటారు. అలా ఈ 12 రోజుల పాటు స్వామివారిని పూజించి, ప్రతిరోజు ఆయనకి పాలను నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన శ్రీమహావిష్ణువు సమస్త పాపాలను నశింపజేసి, పుణ్య ఫలాలుగా సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News