ఆదిదేవుని అంశావతారమే హనుమంతుడు
పరమశివుని అంశావతారమే హనుమంతుడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. త్రిపురాసుర సంహారం సమయంలో తనకి సాయపడిన శ్రీమహావిష్ణువుకి, తిరిగి సాయం చేయాలని శివుడు నిర్ణయించుకున్నాడట. శ్రీమహావిష్ణువు రామావతారాన్ని ధరించినప్పుడు, రావణ సంహారంలో ఆయనకి సాయపడాలనే ఉద్దేశంతో ఆదిదేవుడు హనుమంతుడిగా అవతరించాడు. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు చెప్పబడుతున్నాయి.
ఒకసారి హనుమంతుడు ఆకలితో ఉండటాన్ని సీతమ్మ తల్లి గమనించిందట. భోజనం చేయమంటూ ఆయనకి వివిధ రకాల పదార్థాలను వడ్డించింది. తనకి ఎంతో ప్రీతికరమైన పదార్థాలు కావడంతో, హనుమంతుడు వెంటవెంటనే ఇస్తరి ఖాళీ చేస్తున్నాడు. సీతమ్మ తల్లి మళ్లీ మళ్లీ వడ్డిస్తున్నా, చాలనే మాట అనకుండా ఆయన ఆరగిస్తున్నాడు. ఆయన ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించడంతో సీతమ్మ తల్లి పరిశీలనగా చూసింది.
అప్పుడు హనుమంతుడు స్థానంలో పరమశివుడు కూర్చుని భోజనం చేస్తుండటం ఆమెకి కనిపించడంతో విషయం అర్థమైంది. సిద్ధం చేసిన పదార్థాలు అయిపోవస్తుండటంతో, 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ, సంతృప్తి చెందవలసిందిగా మనసులోనే ప్రార్ధించిందట. అప్పుడు హనుమంతుడు '' చాలు తల్లీ కడుపు నిండి పోయింది'' అన్నాడట.