శివరాత్రి పూజా ఫలం!

సర్వశక్తిమంతుడు .. సర్వవ్యాపకుడు అయిన పరమశివుడు అనేక నామాలతో పూజించబడుతున్నాడు. ఆది దేవుడిగా .. కరుణామయుడుగా కొలవబడుతున్నాడు. అలాంటి సదాశివుడిని విశేషంగా పూజించవలసిన రోజే 'మహా శివరాత్రి'. మాఘమాసంలో అమావాస్యకి ముందుగా వచ్చే బహుళ చతుర్దశి 'మహా శివరాత్రి'గా చెప్పబడుతోంది.

కోటి సూర్యబింబాలకి సమానమైన వెలుగుతో ఆ పరమశివుడు మహాలింగంగా ఉద్భవించినది ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఈ రోజున పగలు ఉపవాసం .. రాత్రి జాగారంతో శివుడిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున భక్తులు ఆయా పూలతో స్వామిని పూజిస్తుంటారు. గన్నేరులు .. పొగడలు .. గులాబీలు .. కలువలు .. సంపెంగలు .. జాజులు .. నందివర్ధనాలు .. మారేడు దళాలు శివుడికి ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

ఒక్కో రకమైన పూలతో ఆ స్వామిని సేవించడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుంది. జీవితంలో దారిద్ర్య బాధలు పడకూడదనే అంతా కోరుకుంటారు. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనీ .. వ్యాధుల బారిన పడకూడదని .. మోక్షాన్ని పొందాలని అనుకుంటారు. అందువలన దారిద్ర్య బాధల నుంచి విముక్తి కోసం బిల్వదళాలతోను .. వ్యాధుల బారిన పడకుండా వుండటం కోసం బండి గురివింద పూలతోను .. జ్ఞానం కోసం మల్లె పూలతోను .. మోక్షాన్ని కోరుకునే వారు ఉమ్మెత్త పూలతోను ఆ దేవదేవుడిని అర్చించవలసి వుంటుంది. ఇలా స్వామికి ఇష్టమైన పువ్వులను భక్తితో సమర్పించడం వలన, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావడం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News