అదే ఈ ప్రాచీన క్షేత్రం ప్రత్యేకత!
హనుమంతుడు అనేక నామాలతో పిలవబడుతుంటాడు .. అశేష భక్త జన సందోహంతో కొలవబడుతుంటాడు. దుష్ట శక్తులను దూరం చేసే వీరాంజనేయుడుగా .. ఆయురారోగ్యాలను ప్రసాదించే అభయాంజనేయుడుగా ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఆంజనేయుడు కొన్ని క్షేత్రాల్లో సువర్చలాదేవి సమేతుడై పూజాబిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం 'పాశ్చాపురం'లో అలరారుతోంది.
కృష్ణా జిల్లాలోని ప్రాచీనమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. తీర్చిదిద్దినట్టుగా ప్రాకారాలు .. రాజగోపురం దర్శనమిస్తుంటాయి. విశాలమైన ఆలయ ప్రాంగణం మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటుంది. ప్రధాన ఆలయ స్థంభాలపై హనుమంతుడు వివిధ భంగిమలలో కనిపిస్తుంటాడు. ఆలయప్రాంగణంలో అందమైన కల్యాణ మంటపమును .. యాగశాలను ఏర్పాటు చేశారు.
గర్భాలయంలో స్వామి సువర్చలా దేవితో కలిసి ఆశీనుడై వుంటాడు. ఇక్కడి స్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు. 11 మంగళ వారాల పాటు స్వామిని పూజించడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. సువర్చలా సమేతుడైన స్వామిని ఆరాధించడం వలన కార్యసిద్ధి కలుగుతుందని అంటారు. ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు చేకూరతాయని చెబుతారు.