ఆపదలో ఆదుకునే నారసింహుడు
నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసమే ఆవిర్భవించాడు కనుక, భక్తులను ఆదుకోవడంలోను .. అనుగ్రహించడంలోను ఆయన ఎంత మాత్రం ఆలస్యం చేయడని అంతా విశ్వసిస్తుంటారు. ఆ స్వామి కొలువైన ప్రాచీనమైన క్షేత్రాల్లో ప్రకాశం జిల్లా పరిధిలో గల 'సింగరాయ కొండ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని చెప్పబడే ఎన్నో సంఘటనలు ఇక్కడ కథలు .. కథలుగా వినిపిస్తూ వుంటాయి.
పూర్వం ఈ స్వామిని అర్చించే పూజారి, పసివాడైన తన బిడ్డతో సహా ఆలయానికి వెళ్లి, స్వామివారికి నైవేద్యం సమర్పించి వెనుతిరిగాడట. తన బిడ్డను ఆలయంలో మరిచిపోయి వెళ్లిన ఆయనకి, చాలా సేపటి తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు తిట్టుకుంటూ, పరుగు పరుగున ఆలయం దగ్గరికి చేరుకున్నాడు. పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ ఉంటాడని అనుకుంటూ, ఆతృతగా తలుపులు తెరిచాడు.
ఆలయంలో ఆడుకుంటోన్న పిల్లవాడిని చూసి ఆనందంతో పొంగిపోయాడు. పిల్లవాడిని అక్కున చేర్చుకుని ''ఆకలి వేయలేదా?'' అని అడిగితే, నరసింహస్వామి మూర్తిని చూపించి ఆయన తనకి అన్నం తినిపించాడని చెప్పాడట. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెబుతుంటారు. ఇక్కడి నారసింహుడు మనసున్నవాడనీ .. మహిమగలవాడనీ .. ఆపదలో ఆదుకునే బంధువని విశ్వసిస్తుంటారు.