ఇక్కడ స్వామివారికి ఇష్టమైన నైవేద్యం!
శ్రీనివాసుడు ఎక్కడ వుంటే అక్కడ అభయం వుంటుంది .. వైభవం వుంటుంది. అలాంటి శ్రీనివాసుడికి ఆయా సమయాల్లో వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. అలాంటి పదార్థాల కన్నా ఎక్కువగా స్వామివారు 'అన్నం - పచ్చిపులుసు'ను నైవేద్యంగా స్వీకరించే క్షేత్రం ఒకటి వుంది .. అదే 'కురుమూర్తి' క్షేత్రం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ' అమ్మాపూర్' సమీపంలో విలసిల్లుతోంది.
స్వయంభువుగా ఆవిర్భవించిన ఇక్కడ శ్రీనివాసుడు .. కురుమూర్తిస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ భక్తులను పలకరిస్తే చాలు .. స్వామివారి మహిమలను తమ అనుభవాలుగా చెబుతుంటారు. వాటిని బట్టి ఈ స్థల మహాత్మ్యం .. ఈ స్వామి మహిమ ఎంతటిదో తెలుస్తుంది. ఈ క్షేత్రంలో తొలిసారిగా తనని సేవించిన భక్తులనే కాదు, వారి వంశాలనే స్వామి తరింపజేశాడు.
అందుకే స్వామికి సంబంధించిన సేవల్లోను .. ఉత్సవాలలోను ఆయా వంశస్తులు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటారు. అలా నైవేద్యం విషయానికి వచ్చేసరికి, కొత్తకుండలో వండిన అన్నం - పచ్చిపులుసును మాత్రమే స్వామి ప్రీతితో స్వీకరిస్తూ వుండటం విశేషం. ఒక భక్తుడికి ఆయన ఇచ్చిన వరం కారణంగానే, ఇప్పటికీ ఆ భక్తుడి వంశస్తులు స్వామికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. భక్తితో సమర్పిస్తే స్వామి దానిని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడనడానికి, ఇక్కడ కొనసాగుతూ వస్తోన్న పద్ధతి అద్దం పడుతుంటుంది.