విజయాన్ని ప్రసాదించే పట్టాభిరాముడు
జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏవో ముఖ్యమైన కార్యాలను తలపెడుతూనే వుంటారు. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆ కార్యాలు సఫలీకృతం కావాలని అంతా ఆశిస్తుంటారు. తమ ఇష్ట దైవానికి చెప్పుకుని .. ఆశీస్సులు అందుకుని ఆ కార్యాలను మొదలు పెడుతుంటారు. అలా భక్తుల విన్నపాలను స్వీకరించి .. వాళ్లు తలపెట్టిన కార్యాలను విజయవంతంగా పూర్తయ్యేలా చూసే దైవంగా పట్టాభిరాముడు కనిపిస్తూ ఉంటాడు.
ఆ స్వామి కొలువైన ఆ క్షేత్రం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం 'మక్కపేట'లో అలరారుతోంది. కృష్ణా జిల్లా పరిధిలో గల ప్రాచీన రామాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి ఆలయంలో సీతారాములు .. లక్ష్మణుడు .. హనుమంతుడుతో పాటుగా, భరత .. శతృఘ్నులు దర్శనమిస్తూ వుంటారు. సీతారాములు ఒకే సింహాసనంపై కూర్చున్న పట్టాభిషేక చిత్రం చూడవలసిందే.
మూలవిరాట్టు మూర్తులలో తేజస్సు ఉట్టిపడుతూ వుంటుంది. ఇక్కడ స్వామివారి కల్యాణం కనులపండుగా జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో గల సువిశాలమైన ప్రదేశంలో కల్యాణ మంటపం వుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.