లక్ష్మీదేవి అప్పుడు తప్పక వుంటుందట!

ఆదిలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్యలక్ష్మి .. గజలక్ష్మి .. సంతానలక్ష్మి .. విజయలక్ష్మి.. విద్యాలక్ష్మి .. ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్మీ స్వరూపాలను స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. అష్టలక్ష్మీ దేవతలలో ఎవరిని పూజించినా .. సేవించినా మిగతా అమ్మవార్ల అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అంటే లక్ష్మీదేవి ఆరాధన వలన .. అనుగ్రహం వలన సమస్తమూ సమకూరతాయన్న మాట.

సాధారణంగా ధనలక్ష్మిని భక్తులు అధికంగా ఆరాధిస్తూ వుంటారు. ఆ తల్లిని పూజించడం వలన దారిద్ర్యం నశిస్తుంది .. సంపద పెరుగుతుంది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు .. బాధలు .. సమస్యలు ఎదురవుతూ వుంటాయి. వాటిలో అత్యధికంగా బాధించేది ఆర్ధికపరమైన సమస్య అని చెప్పవచ్చు. ఆర్ధికంగా బలంగా లేనప్పుడు అవసరాలు తీరవు .. ఆశలు నెరవేరవు. పైగా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది .. ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది.

సంపద లేని కారణంగా సంతోషం .. ఆరోగ్యం మాత్రమే కాదు బంధుగణమంతా దూరమవుతుంది. అందుకే సంపదకు అంతా అంతటి ప్రాముఖ్యతను ఇస్తారు. అలాంటి సంపద చేకూరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. అయితే లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా వుండదు కదా అనే అభద్రతా భావం కలుగుతూ వుంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే .. విష్ణుమూర్తిని సదా పూజిస్తూ వుండాలని చెప్పబడుతోంది.

తనని మాత్రమే కాదు .. తన భర్త అయిన విష్ణుమూర్తిని అనునిత్యం పూజిస్తూ ఉండేవారి పట్ల లక్ష్మీదేవి మరింత ప్రీతిని కలిగి ఉంటుందట. అందువలన ఎక్కడైతే నిరంతరం విష్ణునామ సంకీర్తనం జరుగుతూ వుంటుందో, అక్కడ ఆ తల్లి సంతోషంగా .. స్థిరంగా ఉండిపోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా అమ్మవారు స్థిర నివాసం చేస్తే, అక్కడ సిరిసంపదలకు .. సుఖసంతోషాలకు కొదవేం వుంటుంది?


More Bhakti News