ఆపదలు తొలగించే ఆదికేశవస్వామి
కృష్ణా అంటే కష్టాలు ఉండవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తన భక్తుల కష్టాలను తీర్చడానికే స్వామి అనేక ప్రదేశాల్లో కొలువయ్యాడని అంతా విశ్వసిస్తూ వుంటారు. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా నర్సాపురం కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గల ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా అలరారుతోంది.
ఇక్కడ స్వామి ఆదికేశవస్వామి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఆహ్లాదానికి ఆనవాలుగా అనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలోని స్వామివారి సుందరమూర్తిని చూసి తీరవలసిందే. నయనమనోహరమైన ఆ రూపం మనసుని కుదుటపరుస్తూ వుంటుంది.
ఆ స్వామిని ఆరాధించేవారిని ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆపద సమయంలో ఆయనని స్మరించినంతనే, మంచు తెరల్లా అవి తొలగిపోతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక్కడి కోనేరులోని నీటిని స్పర్శించినంత మాత్రాన్నే, పాపాలు .. శాపాలు .. దోషాలు తొలగిపోతాయని స్థల పురాణం చెబుతోంది. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లోను ఈ క్షేత్రంలో విశేషంగా పూజాభిషేకాలు .. ఉత్సవాలు జరుగుతుంటాయి. భక్తులు ఆ స్వామిని సేవిస్తూ తరిస్తుంటారు.