పంచముఖ హనుమ ఆరాధన ఫలితం

హనుమంతుడిని తలచుకోగానే భయం తొలగిపోతుంది. అందుకే ఆంజనేయస్వామి దండకం చదువుతూ, చిన్నపిల్లలను నిద్రపుచ్చుతూ వుంటారు. ఇక అనారోగ్యాల బారిన పడినవారు, తమ ఆరోగ్యం కుదుటపడటం కోసం ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తుంటారు. భక్తిశ్రద్ధలతో ఆయనకి ప్రదక్షిణలు చేస్తుంటారు.

దుష్ట శక్తులచే పీడించబడుతున్నవాళ్లు కూడా ఆయన అనుగ్రహం కోసం ఆరాటపడతారు. మనసులోని కోరికలు నెరవేరాలనుకునేవారు ఆ స్వామికి సిందూర అభిషేకాలు .. ఆకు పూజలు చేయిస్తుంటారు. ఇలా స్వామి భక్తాంజనేయుడు .. ప్రసన్నాంజనేయుడు .. ధ్యానాంజనేయుడు .. వీరాంజనేయుడు తదితర నామాలతో .. రూపాలతో భక్తుల పూజలు అందుకుంటూ వుంటాడు.

అలాగే కొన్ని క్షేత్రాల్లో 'పంచముఖ హనుమంతుడు' దర్శనమిస్తూ వుంటాడు. పంచముఖ హనుమంతుడిని ఆరాధించడం వలన, విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది. ఈ స్వామిని అంకితభావంతో అనునిత్యం ఆరాధించడం వలన, ధర్మ బద్ధమైన కోరికలు వెంటనే నెరవేరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

విభీషణుడి కుమారుడైన 'నీలుడు' పంచముఖ హనుమను ఆరాధించి కోరిన వరాలను పొందాడని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఎంతోమంది భక్తులు పంచముఖ హనుమను పూజించి, కార్యసిద్ధిని పొందారని తెలుస్తోంది. అందువలన మనసులోని ధర్మబద్ధమైన బలమైన కోరికలను నెరవేర్చుకోవడానికి గాను, పంచముఖ హనుమ ఆరాధన అత్యుత్తమ మార్గమని చెప్పబడుతోంది.


More Bhakti News