భారీగా దర్శనమిచ్చే బాబా క్షేత్రం
భక్తుల బాధలు తీర్చే శక్తిగా .. వాళ్ల బాధ్యతలను మోసే మానవతా మూర్తిగా శిరిడీ సాయిబాబా కనిపిస్తూ ఉంటాడు. ఆయా గ్రామాల్లో కనిపించే ఆయన ఆలయాలన్నీ, ఆయన పట్ల భక్తులకు గల నమ్మకానికి నిదర్శనమే. చాలామంది ఆయనని పూజిస్తూ .. సేవిస్తూ తమని ముందుకు నడిపించేది ఆయనేనని విశ్వసిస్తుంటారు. ఆయన ఆలయాలు పవిత్రతకి చిహ్నంగా .. ప్రశాంతతకి ప్రతీకగా కనిపిస్తుంటాయి.
ఇక ఆరుబయటనే అతిభారీగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధించే ప్రదేశాలు కూడా బాగానే కనిపిస్తుంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటిగా నల్గొండ జిల్లా నేరుడుచర్ల మండలం 'దిర్శించర్ల' కనిపిస్తుంది. ఇక్కడ భక్తులంతా కలిసి 125 అడుగుల భారీవిగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాబా జోలె తగిలించుకుని రెండు చేతులతో ఆశీస్సులు అందజేస్తున్నట్టుగా వుంటుంది.
తన ప్రేమ .. కరుణ ఎప్పటికీ ఉంటాయని బాబా చెబుతున్నట్టుగా ఈ నిలువెత్తు రూపం దర్శనమిస్తూ వుంటుంది. ఆయన చూపుల్లో ఆకాశామంతటి దయ కనిపిస్తూ వుంటుంది. విశ్వప్రేమను ఆవిష్కరించే ఈ విగ్రహాన్ని మలిచిన తీరు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. బాబా నిజంగానే కొండంత అండగా వున్నాడనే భరోసా భక్తులకు లభిస్తూ వుంటుంది.
దాదాపు రెండు ఎకరాల్లో ఈ నిర్మాణాలను చేపట్టారు. ఇక్కడే బాబా ప్రతిమలు కొన్ని వివిధ రూపాల్లో దర్శనమిస్తూ, ఆయన లీలావిశేషాలను తెలుపుతుంటాయి. సాయికోటి స్థూపం చుట్టూ భక్తులు 5 ప్రదక్షిణాలు చేస్తూ తమ మనసులోని మాటను ఆయనకి చెప్పుకుంటూ వుంటారు. ప్రకృతి మధ్యలో .. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఈ బాబాను దర్శించడం వలన, మనసుకి కావలసిన ప్రశాంతత లభిస్తుంది.