శని బాధ ఇలా కూడా తగ్గుతుందట!

జీవితంలో అనేక కష్టనష్టాలను అనుభవంలోకి తీసుకొస్తూ ఎన్నో బాధలకు శనిదేవుడు గురిచేస్తూ ఉంటాడని కొందరు చెబుతుంటారు. ఎదురుదెబ్బలకు అలవాటుపడేలా చేసి .. వాటిని తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తాడని మరికొందరు అంటారు. ఏదేవైనా శని దోషం అనే మాట వినగానే మాత్రం చాలా మంది కంగారుపడిపోతారు.

ఇక తమని సమస్యలు చుట్టిముట్టినట్టేనని ఆందోళన చెందుతారు. వాటిని ఎదుర్కోవడం తమ వలన కాదని డీలాపడిపోతారు. శని దోష నివారణకి అనుసరించ వలసిన మార్గాలను అన్వేషించడానికి ఆరాటపడతారు. శనిదేవుడి ప్రీతి కోసం అభిషేకాలు .. హోమాలు చేయిస్తూనే, మరో వైపున సత్ ప్రవర్తనతో నడచుకుంటే ఆయన శాంతిస్తాడని చెప్పబడుతోంది.

ఈర్ష్యా అసూయ ద్వేషాలు విడనాడటం వలన, అసత్యాలకీ .. వ్యసనాలకి దూరంగా వుండటం వలన ఆయన కాస్త కనికరం చూపుతాడు. ఏ కారణంగాను ఇతరులను బాధపెట్టడం .. ఇబ్బంది పెట్టడం వంటి పనులు చేయకుండా, తోచిన రీతిన సహాయ సహకారాలను అందిస్తూ వుండాలి. మూగ జీవాలను ఏ రకంగాను బాధించకుండా, వాటికి ఆహారాన్ని సమకూరుస్తూ వుండాలి. ఉన్నదానిలోనే ఇతరులకు దానం చేస్తూ .. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ సంతృప్తిని పొందాలి. ఇలా మంచి మనసుతో నడచుకోవడం వలన శని దేవుడు ప్రీతి చెందుతాడనీ, ఫలితంగా శని బాధల నుంచి చాలా వరకూ ఉపశమనం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News