అదే సుబ్రహ్మణ్యస్వామి మహిమ!

భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం సుబ్రహ్మణ్యస్వామి వివిధ ప్రదేశాల్లో అవతరించాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం 'కోటంక' గ్రామంలో దర్శనమిస్తుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడనీ .. పూర్వం స్వామి సర్పరూపంలో మహర్షులకు దర్శనమిస్తూ వుండేవాడని చెబుతుంటారు.

ఇక్కడ స్వామివారి సన్నిధిలో పాతాళగంగ వుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇందులోని నీటి ధార తగ్గకపోవడం విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇది స్వామివారి మహిమగా విశ్వసిస్తూ వుంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. పాతాళ గంగలోని నీటిని తీర్థంగా స్వీకరించడానికి భక్తులు మరింత ఆసక్తిని చూపుతారు.

ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. వివాహం విషయంలోను .. సంతాన భాగ్యం విషయంలోను ఆలస్యమవుతున్నప్పుడు, ఈ స్వామిని దర్శించుకుని మనసులో మాట చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, పుణ్యఫలాలు చేకూరతాయని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.


More Bhakti News