ఆపదలో ఆదుకునే రాజరాజేశ్వరుడు

రాజరాజేశ్వరుడు అనే నామం వినగానే వేములవాడ క్షేత్రం గుర్తుకు వస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం ప్రాచీనకాలం నుంచి వెలుగొందుతూ వుంది. పరమశివుడు రాజరాజేశ్వరీదేవి సమేతంగా రాజరాజేశ్వరుడు పేరుతో ఈ క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ క్షేత్రం దేవాలయాల సముదాయంగా .. శివలింగాల సమాహారంగా కనిపిస్తుంది.

ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ, ఇక్కడి స్వామివారినీ .. అమ్మవారినీ ఇప్పటికీ దేవతలు కొలుస్తూ ఉంటారని భక్తులు భావిస్తుంటారు. దేవగురువైన బృహస్పతి ద్వారా ఈ క్షేత్రం యొక్క విశిష్టతను గురించి దేవేంద్రుడు తెలుసుకుని వచ్చి, ఇక్కడి స్వామివారిని ఆరాధించి కోరిన వరాలను పొందాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇక త్రేతాయుగంలో అరణ్యవాస కాలంలో శ్రీరామచంద్రుడు .. ద్వాపర యుగంలో వనవాస కాలంలో పాండవులు ఈ స్వామిని సేవించి అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థలపురాణం వలన తెలుస్తోంది. ఇక్కడి 'ధర్మకుండం' గురించి కూడా భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని అంటారు.

ఆపదలో వున్నవారిని ఆదుకోవడానికి స్వామి ఎంతమాత్రం ఆలస్యం చేయడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. 'రాజన్నా' అని భక్తితో .. ప్రేమతో పిలిస్తే చాలు, ఆపదలను గట్టెక్కిస్తాడని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతారు. అందుకే ఆ స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు .. ఆయన మహిమలను కొనియాడుతుంటారు.


More Bhakti News