సకల శుభాలను ప్రసాదించే సత్యదేవుడు

భూలోకంలో మానవులు కష్టనష్టాల నుంచి బయటపడటానికి తగిన మార్గాన్ని సూచించమని శ్రీమహావిష్ణువును నారద మహర్షి కోరతాడు. సత్యనారాయణస్వామి వ్రతానికి మించిన మార్గం లేదని శ్రీమహావిష్ణువు సమాధానమిచ్చాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే వ్రతాలలో సత్యనారాయణస్వామి వ్రతానికి విశిష్టమైన స్థానం లభించింది.

మానవులను సమస్త బాధల నుంచి కాపాడటానికే స్వామి ఈ భూమి మీద అవతరించాడు. అర్చామూర్తిగా అనేక ప్రాంతాలలో పూజలు అందుకుంటూ .. వ్రత ఫలితాన్ని అందిస్తూ వస్తున్నాడు. అలా స్వామివారు కొలువైన క్షేత్రాల్లో ఒకటి, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 'గూడెం' గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడి గోదావరి సమీపంలో గల కొండపై స్వామి రమా సహిత సత్యనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

చాలాకాలం క్రితం స్వామి .. ఒక భక్తుడికి కలలో కనిపించి, ఇక్కడి కొండపై గల గుహలో వెలసినట్టుగా చెప్పాడట. అలా ఈ స్వామి వెలుగులోకి వచ్చాడని అంటారు. నదీ తీరంలో సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం నదీ తీరంలో వుండటం వలన, భక్తుల రాక ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. స్వామి స్వయంభువుగా అవతరించిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన .. ఇక్కడ వ్రతాన్ని జరిపించడం వలన, సకల శుభాలు చేకూరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News