మహిమగల మహాదేవుడి క్షేత్రం
మహాదేవుడైన శివుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఆపదలో .. అవసరాల్లో వున్నవారిని ఆదుకోవడం కోసం అనేక మహిమలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'కొప్పోలు' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.
పరమశివుడు ఇక్కడ శ్రీ పార్వతీ దుర్గా సమేత రామలింగేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ క్షేత్రంలో స్వామివారు వెలుగు చూసి వెయ్యి సంవత్సరాలపైనే అయిందని అంటూ వుంటారు. ఎంతోమంది మహాభక్తులు స్వామివారిని సేవించి .. ఆయనని ప్రత్యక్షంగా దర్శించారని అంటారు. ఇక్కడి స్వామివారిని గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఆయన లీలా విశేషాలను కొనియాడుతూ వుంటారు.
అంకితభావంతో స్వామిని అర్చించాలే గానీ, ఆయన అండదండలు ఎల్లవేళలా ఉంటాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఈ క్షేత్రంలో దాదాపు ముప్పావు ఎకరంలో పెద్ద 'బుగ్గ' (బావి) కనిపిస్తుంది. ఇందులోని జలధార ఈ వెయ్యి సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా తగ్గలేదని చెబుతుంటారు. ఈ నీరు కాశీ నుంచి వస్తుందని తమ పూర్వీకులు చెప్పేవారని అంటారు. అందుకే ఈ నీటిని వాళ్లు దివ్యమైన తీర్థంగా భావిస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన .. స్వామిని సేవించడం వలన .. ఇక్కడి తీర్థాన్ని స్వీకరించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ వుంటారు.