సిరిసంపదలనిచ్చే శ్రీనివాసుడు
అసలు సిసలైన సౌందర్యం ఎవరిదయ్యా అంటే, పురుషోత్తముడైన వేంకటేశ్వర స్వామిదే. ఆయన సౌందర్యం చూడటానికి వేల కన్నులు చాలవు .. వేల జన్మలు చాలవు. అసలు ఆయన సౌందర్యం చూసే భక్తులు తమ కష్టాలను మరిచిపోతుంటారు. ఈ కష్టాలే నీ దగ్గరికి నడిపించుకువచ్చి నీ దర్శనం చేయించాయి కనుక, ఇకపై వాటిని నేను కష్టాలుగా భావించను అని అనుకునేలా చేయడం ఆయన సౌందర్య మహిమే.
అంతటి సౌందర్యవంతుడిగా వేంకటేశ్వర స్వామి దర్శనమిచ్చే క్షేత్రం మనకి చిత్తూరు జిల్లాలోని 'కీలపట్ల'లో కనిపిస్తుంది. వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడి స్వామిని చూస్తే తిరుమల శ్రీనివాసుడిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. నిండైన మూర్తిగా .. మహా తేజస్సుతో ఇక్కడి స్వామి వెలిగిపోతూ వుంటాడు. సాక్షాత్తు ఇక్కడి స్వామివారిని భ్రుగు మహర్షి ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.
ఎందరో మహర్షులు సేవించిన ఈ స్వామికి కాలక్రమంలో జనమేజయ మహారాజు ఆలయాన్ని నిర్మించాడట. ఆ తరువాత కాలంలోని రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారని అంటారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు మహిమాన్వితమైనదని చెబుతారు. ఈ కోనేటి నీటిని తలపై చల్లుకున్నంత మాత్రాన్నే సమస్త పాపాలు హరిస్తాయని అంటారు. ఈ స్వామి దర్శనం చేసుకోవడం వలన దారిద్ర్య బాధలు నశించి సిరిసంపదలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.