దోషాలను తొలగించే తీర్థయాత్రలు

భగవంతుడి దర్శనం .. ఆయన నామస్మరణ .. పూజాభిషేకాలు అనంతమైన పుణ్యఫలితాలను ప్రసాదిస్తూ వుంటాయి. ఇక ఆ స్వామి దర్శనార్థం చేసే తీర్థయాత్రలు సమస్త దోషాలను తొలగించి .. కోరిన వరాలతో సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తాయి. అందుకనే అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తుండాలి.

బాధ్యతలు తీరిన తరువాత తీర్థయాత్రలు చేయవచ్చనే ఆలోచనలో కొంతమంది వుంటారు. అయితే అప్పటికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ వుంటాయి. వెళ్లాలని అనుకున్న క్షేత్రానికి చేరుకోవడానికి నానాఅవస్థలు పడవలసి వుంటుంది. శరీరం సహకరించకపోతే .. అయ్యో దైవదర్శనం చేసుకోలేకపోయామేననే బాధ మరింత ఎక్కువగా వుంటుంది. అందుకనే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

ఇక వివాహయోగానికి .. సంతాన భాగ్యానికి సంబంధించిన దోషాలు కూడా తీర్థయాత్రల వలన తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రెండు విషయాల్లో ఆలస్యం జరుగుతున్నప్పుడు కూడా తీర్థయాత్రలు చేయవలసి వుంటుంది. భగవంతుడు ఆవిర్భవించిన ప్రదేశం కావడం వలన .. మహర్షులు తపస్సు చేసుకున్న కారణంగా .. మహాభక్తులు కీర్తించిన కారణంగా .. యోగులు .. సిద్ధులు నడయాడటం వలన పరమ పవిత్రమైనవిగా పుణ్యక్షేత్రాలు విలసిల్లుతుంటాయి. అలాంటి క్షేత్రాల్లో అడుగుపెట్టడం వల్లనే అన్నిరకాల దోషాలు తొలగిపోతాయి. ఆ దైవానుగ్రహంతో మనసులోని ధర్మబద్ధమైన కోరికలు తీరిపోతాయి.


More Bhakti News