వివాహ యోగాన్ని కలిగించే వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరస్వామి లీలా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. తన భక్తులను రక్షించుకోవడం కోసం ఆయన చూపుతోన్న మహిమలు అనేకం. ఆపదలో వున్న చాలామందికి ముందుగా గుర్తుకువచ్చేది ఆయనే. ఏ కార్యమైనా ప్రారంభించేటప్పుడు ఆ భారాన్ని వేసేది ఆయన పైనే. తన భక్తులకు నయనానందాన్ని కలిగించడం కోసం వైభవాన్ని అనుభవించే ఆ స్వామి, వాళ్ల కోసం అవన్నీ వదులుకుని రావడానికి సిద్ధపడుతూనే వుంటాడు.

ఆ దివ్యమైన రూపాన్ని ఎప్పుడూ దర్శించాలనే కోరికతో చాలా గ్రామాల్లో భక్తులు ఆయనకి ఆలయాన్ని కట్టుకుని పూజిస్తూ వుంటారు. అలాగే ఇతర దేశాల్లో వుండేవారు సైతం ఆ స్వామికి ఆలయాలను నిర్మించుకుని ఆయన సేవలో తరిస్తుంటారు. అలాంటి విశిష్టమైన దేవాలయాల్లో 'పిట్స్ బర్గ్' లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. అమెరికాలోని మొదటి హిందూ దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది.

వేంకటేశ్వరస్వామి కొలువైన ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అలా ఈ క్షేత్రానికి వివాహయోగాన్ని కలిగించే విశిష్టత వుందని భక్తులు చెబుతుంటారు. వివాహం విషయంలో వివిధ కారణాల వలన ఆలస్యం అవుతున్నప్పుడు ఈ స్వామిని దర్శించుకుని మనసులో మాట చెప్పుకుంటే, మూడు నెలలలోగా వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆదివారం రోజున ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. అమెరికా వెళ్లిన చాలామంది ఆ స్వామిని దర్శించుకోకుండా రావడం ఒక వెలితిగా భావిస్తుంటారు. అంతగా అందరి మనసులకు ఆయన చేరువయ్యాడు .. కోరిన వరాలను ప్రసాదించే కొంగు బంగారమయ్యాడు.


More Bhakti News