హంపీ క్షేత్రానికి ఆ పేరు అలా వచ్చిందట!
ఆధ్యాత్మిక పరంగాను .. చారిత్రక పరంగాను ఎంతో విశిష్టతను సంతరించుకున్న క్షేత్రాల్లో హంపీ ఒకటిగా కనిపిస్తుంది. తుంగభద్రా నదీ తీరంలోని ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే, ఇక్కడి ప్రతి శిల ఏదో ఒక కథను మనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఆలయాల నగరంగా చెప్పబడే హంపీ .. అలనాటి శిల్పకళా నైపుణ్యానికి అద్దంపడుతూ ఆహ్వానం పలుకుతుంటుంది.
ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి కారణమంటూ ఒక కథ వినిపిస్తూ వుంటుంది. పార్వతీదేవి అంశావతరమైన 'పంపాదేవి' బ్రహ్మదేవుడి కూతురుగా జన్మించిందట. సదాశివుడిని ప్రేమించిన ఆమె ఆయనని భర్తగా పొందడానికి తపస్సును మించిన మార్గం లేదని తెలుసుకుని కఠోర తపస్సును చేసిందట. ఆమె తపస్సుకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై .. ఆమెను తన అర్థాంగిని చేసుకున్నాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి విరూపాక్ష స్వామి ఆలయాన్ని పంపా ఆలయమనీ .. ఈ క్షేత్రాన్ని పంపా క్షేత్రమని పిలుచుకునేవారట. కాలక్రమంలో పంపా పేరు కాస్తా హంపీగా మారిందని చెబుతుంటారు.