శ్రీరాముడు పాదుకలను ఇచ్చిన క్షేత్రం

ప్రాచీనకాలం నాటి శైవ క్షేత్రాలను దర్శిస్తే .. వాటిలో ఎక్కువగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఇక అలా రాముడు నడయాడిన చాలా ప్రదేశాల్లో ఆ స్వామి క్షేత్రాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. తన భక్తుల కోరిక మేరకు తాను కొలువైన క్షేత్రాలు కూడా దివ్యక్షేత్రాలుగా అలరారుతుంటాయి. అలాంటి రామ సంబంధమైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి మనకి వరంగల్ జిల్లాలోని 'జీడికల్'లో కనిపిస్తుంది.

ఈ ప్రాంతానికి 'వీరాచలం' అనే పేరు కూడా వుంది. ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి ఒక మహాముని కారణమని చెబుతుంటారు. ఒకప్పుడు వీరముని ఈ ప్రదేశంలో శ్రీరాముడిని ధ్యానిస్తూ ఉండేవాడట. ఆయన భక్తికి మెచ్చిన రాముడు ప్రత్యక్షమై తన పాదుకలను ఆయనకి ప్రసాదించాడని అంటారు. ఆ మహాముని పేరుతో ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా వెలుగొందుతుందని రాముడు అనుగ్రహించాడని చెబుతారు.

శ్రీరాముడి పాద స్పర్శ సోకిన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గుండంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు. విశేషమైన రోజుల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. మనసుకు ఆహ్లాదాన్ని .. ఆధ్యాత్మికపరమైన ఆనందానుభూతులను ప్రసాదించే ఈ క్షేత్రాన్ని చూసి తీరవలసిందే.


More Bhakti News