దత్తాత్రేయుడి నామస్మరణ చాలు

దత్తాత్రేయుడి నామం అత్యంత శక్తిమంతమైనది .. మహా మహిమాన్వితమైనది. ఆ స్వామి నామస్మరణ ఎలాంటి కష్టాలనైనా దూరం చేస్తుంది. ఎలాంటి బాధల నుంచైనా విముక్తిని కలిగిస్తుంది. ఆ స్వామి దర్శనం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది .. ఆ స్వామి సేవ మోక్షానికి అవసరమైన అర్హతను కలిగిస్తుంది. అలాంటి స్వామిని ఆయన జయంతి రోజున పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు ఒకే రూపంతో అనసూయాదేవి గర్భాన జన్మించారు. మూడు శిరస్సులతో .. ఆరు చేతులతో .. కాషాయ వస్త్రాలతో .. శంఖ చక్రాలతో ..గదా పద్మాలతో .. త్రిశూలం .. రుద్రాక్షమాలలు .. యజ్ఞోపవీతం ధరించిన దత్తాత్రేయస్వామి పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపుడిగా దర్శనమిస్తూ వుంటాడు.

ప్రకృతిలోని ప్రతి జీవిని గురువుగా భావించమని దత్తాత్రేయస్వామి తత్త్వం చెబుతోంది. హనుమంతుడు .. సుబ్రహ్మణ్యేశ్వరుడు .. పరశురాముడు .. కార్త వీర్యార్జునుడు .. ప్రహ్లాదుడు .. యదుమహారాజు .. అలర్కుడు .. వేదధర్ముడికి దత్తాత్రేయుడు జ్ఞానబోధ చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి దత్తాత్రేయ స్వామిని ఆపదలో తలచుకున్నంత మాత్రాన్నే ఆయన రక్షణ లభిస్తుంది. జీవితాన్ని వెలుగు మార్గంలో ప్రయాణింపజేసే జ్ఞానం .. సంతృప్తికరమైన జీవితం అనంతరం మోక్షం కలుగుతుంది.


More Bhakti News