ముక్తిని ప్రసాదించే ముక్కోటి ఏకాదశి
ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశులలో 'ముక్కోటి ఏకాదశి'కి ఎంతో విశిష్టత వుంది. ప్రతి ఏకాదశి శ్రీమహావిష్ణువుకు పరమ ప్రీతికరమైనదే. అలాంటి ఏకాదశులలో ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని 'ముక్కోటి ఏకాదశి'గా చెబుతారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కనుక, దీనిని వైకుంఠ ఏకాదశి అనికూడా పిలుస్తుంటారు.
ఈ రోజున తెల్లవారు జామునే అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే సహజంగానే ఉత్తర ముఖద్వారంగా ఆవిర్భవించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మునగాల మండలం .. బరాఖత్ గూడెం లో దర్శనమిస్తుంది.
అందువలన ముక్కోటి రోజున భక్తులు విశేష సంఖ్యలో ఈ క్షేత్రానికి తరలివస్తారు. శ్రీమహావిష్ణువుపై అలక వహించిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తుంది. ఆమెను వెతుక్కుంటూ స్వామివారు కూడా భూలోకానికి వస్తాడు. అలా వచ్చిన వాళ్లిద్దరూ ఈ ప్రదేశంలో కలుసుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. భక్తులను అనుగ్రహించడం కోసం స్వామివారు ఆవిర్భవిస్తే .. లక్ష్మీదేవి పాదపద్మాల ముద్రలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి.
ముక్కోటి రోజున భక్తులు ఉపవాస దీక్షను చేపట్టి .. ప్రాచీనమైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. స్వామిని షోడశ ఉపచారలతో పూజించి .. ఆ రాత్రి ఆయన భజనలతో జాగరణ చేస్తారు. ఈ విధంగా చేయడం వలన సంతోషంతో కూడిన సంతృప్తికరమైన జీవితం లభిస్తుందనీ .. ఆ తరువాత ముక్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.