బలరామ కృష్ణుల ఆలయం!

శ్రీకృష్ణుడి లీలా విశేషాలు తెలుసుకున్నా కొద్దీ ఒళ్లు పులకరిస్తుంది .. జన్మధన్య మైందనిపిస్తుంది. ఆ స్వామి కొలువైన ఆలయాలు ఆయన మహిమలకు నిలయాలుగా అలరారుతూ వుంటాయి. సాధారణంగా స్వామి వేణుగోపాలుడిగా .. రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడిగా వెలుగొందుతూ వుంటాడు. ఇక పూరీ వంటి క్షేత్రాల్లో సుభద్ర - బలరాములతో కలిసి పూజలు అందుకుంటూ వుంటాడు.

అలాంటి కృష్ణుడు బలరాముడితో మాత్రమే కలిసి భక్తుల మనసు దోచుకునే ఆలయం మనకి 'తిరుచానూరు'లో కనిపిస్తుంది. సోదర ప్రేమకు ప్రతీకలుగా ఇక్కడ బలరామకృష్ణులు దర్శనమిస్తుంటారు. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఎంతోమంది రాజులు .. మహాభక్తులు ఇక్కడి స్వామిని సేవించి తరించినట్టుగా చరిత్ర చెబుతోంది. కృష్ణుడు .. బలరాముడు ఇక్కడ కొలువుదీరడం గురించి ఒక కథనం మనకి వినిపిస్తూ వుంటుంది.

ఒకానొక సందర్భంలో బలరాముడు .. కృష్ణుడు ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి బలరాముడు ప్రస్తావిస్తే, ఈ స్థలం మహిమాన్వితమైనదనీ .. అందుకే మనసుకి మరింత హాయిగా అనిపిస్తోందని కృష్ణుడు అన్నాడట. ఆ ఇద్దరి సంకల్పం కారణంగానే, ఆ తరువాత కాలంలో వారి మూర్తులు పూజభిషేకాలు అందుకుంటున్నాయని చెబుతారు. ఈ ఆలయానికి వెళితే బలరామ కృష్ణులు నడయాడిన ప్రదేశానికి వచ్చిన ఆనందం కలుగుతుంది .. అనిర్వచనీయమైన అనుభూతి మిగులుతుంది.


More Bhakti News