రుణాలు తీర్చే నారసింహుడు
లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఖమ్మం జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది. మౌద్గల్యుడు అనే మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడి గుట్టపై వెలసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం 'స్తంభాద్రి' పేరుతో పిలవబడిన ఈ క్షేత్రం ఆనాటి నుంచి మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతోంది.
ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన వివాహ యోగం కలగడం .. సంతాన భాగ్యం కలగడం జరుగుతాయని అంటారు. అందుకు నిదర్శనంగా ఆ కోరిక నెరవేరిన వారు మొక్కులు చెల్లిస్తూ ఇక్కడ కనిపిస్తుంటారు. మరో విశేషమేమిటంటే .. ఈ స్వామి దర్శనం మాత్రం చేతనే రుణాలు తీరడం. అవసరానికి చేసిన అప్పులు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. వాటిని తీర్చే మార్గం లేక చాలామంది నానా అవస్థలు పడుతుంటారు. అలాంటివారు ఈ స్వామి దర్శనం చేసుకుని తమ ఇబ్బందిని చెప్పుకుంటే, ఆ అప్పు తీరే మార్గాన్ని ఆయన చూపిస్తాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
ఇక ఈ క్షేత్రంలో గుట్ట పైభాగంలో ఏర్పడిన చీలికలో నీళ్లు ఊరుతూ వుండటం స్వామి మహిమగా భావిస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఇందులోని తీర్థం ఎండిపోలేదు. స్వామికి ఈ నీటితోనే అభిషేకం చేస్తుంటారు. స్వామి స్వయంగా ఈ తీర్థాన్ని సృష్టించాడని స్థల పురాణంలో కనిపిస్తుంది. ఇలా అనేక మహిమలకు నిలయంగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది .. కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటుంది.