కార్తీక దీపారాధన వలన ఫలితం!
శివకేశవులకు పరమ ప్రీతికరమైనది కనుక .. కార్తీకమాసం మహా పవిత్రమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని కలిగి వుంటుంది. ఇక 'కార్తీక పౌర్ణమి' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీక మాసంలో స్నానం .. దీపారాధన .. దీపదానం .. ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెప్పబడుతోంది.
కార్తీక దీపాలను దేవాలయాల్లోను .. తులసికోట సన్నిధిలోను .. ఇంటి ముంగిట వెలిగిస్తుంటారు. ఈ దీపాలను సూర్యోదయానికి ముందు .. సాయం సంధ్యా సమయంలోను వెలిగించవలసి వుంటుంది. కార్తీక దీపాలకు ఆవు నెయ్యిని ఉపయోగించడం మరింత ఉత్తమం. శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాలను కార్తీక మాసంలో దర్శించడం వలన .. సేవించడం వలన అనంతమైన పుణ్యఫలితలు చేకూరతాయి.
ఈ మాసంలో శివకేశవులను స్మరిస్తూ దీపారాధన చేయడం వలన .. అలా వెలిగించబడిన దీపాలను దర్శించడం వలన సమస్త పాపాలు హరించి వేయబడతాయి. కష్టాల నుంచి .. బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలగడమే కాకుండా, ఆ ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతూ వుంటుంది. ఇక కార్తీకంలో ఉసిరిక దీపాన్ని దానంగా ఇవ్వడం వలన, ఉత్తమ గతులు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.