మహాదేవుడి మహిమాన్విత క్షేత్రం
మహాదేవుడు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా, విజయనగరం జిల్లాలోని నారాయణపురం కనిపిస్తుంది. సాధారణంగా ఎక్కడైనా ఒక ఊరిలో ఒక శివాలయం వుంటుంది. అలా కాకుండా ఈ క్షేత్రంలో ఒకే ప్రాంగణంలో నాలుగు శివాలయాలు దర్శనమిస్తూ వుంటాయి. ఒక్కో శివలింగం ఒక్కో పేరుతో పిలవబడుతూ .. కొలవబడుతూ వుంటుంది.
ప్రధానమైనదిగా చెప్పబడుతోన్న ఆలయంలోని శివుడు .. నీలకంఠుడుగా పూజలు అందుకుంటూ వుంటాడు. ఇక మిగతా ఆలయాలలోని స్వామి, నాళేశ్వర .. సంగమేశ్వర .. మల్లికార్జున పేర్లతో అభిషేకాలు అందుకుంటూ వుంటాడు. సువర్ణముఖి నదీ తీరాన నిర్మించబడిన ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది. తూర్పు గాంగేయ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతూ వుంటాయి.
ఆలయ కుడ్యాల పై అలనాటి శిల్ప కళా సంపద నయన మనోహరంగా అనిపిస్తూ వుంటుంది. కార్తీకం పరమశివుడికి పరమ ప్రీతికరమైన మాసం కనుక, ఈ మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ మాసంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ శివాలయాలను దర్శించుకుని ధన్యులవుతారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని చెబుతారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని అంటారు.