దోషాలను తొలగించే శివుడు
తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాచీన శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ శివాలయాలన్నీ కూడా ఆనాటి వైభవానికి అద్దం పడుతూ, తమ మహిమలను ఆవిష్కృతం చేస్తుంటాయి. అలాంటి ప్రాచీన ఆలయాలలో ఒకటి ఖమ్మం జిల్లా 'కల్లూరు'లో కనిపిస్తుంది.
ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కాకతీయుల ఏలుబడిలో వుండేది. అందువలన ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు విపరీతంగా కనిపిస్తాయి. కాకతీయుల శివభక్తి .. ఆ ఆలయాల నిర్మాణంలో వాళ్లు తీసుకున్న శ్రద్ధను బట్టి తెలిసిపోతుంది. అలా కాకతీయ 'ప్రతాపరుద్రుడు' తన పరిపాలనా కాలంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడని చరిత్ర చెబుతోంది.
మహాశివరాత్రికి ప్రతాపరుద్రుడు ఇక్కడి స్వామిని దర్శించేవాడని కూడా అంటారు. చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకోవడం వలన, స్వామి మహిమల వలన ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగానే ఉంటుంది. భక్తిశ్రద్ధలతో ఇక్కడి స్వామిని సేవిస్తే పాపాలు .. దోషాలు తొలగిపోతాయనీ, ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.