ఈ రోజున గౌరీదేవిని పూజించాలి
గౌరీదేవి సంతాన సౌభాగ్యాలను అందిస్తుంది .. కోరిన వరాలను పెద్ద మనసుతో ప్రసాదిస్తుంది. అందుకే స్త్రీలు ఆ తల్లిని అనునిత్యం పూజిస్తుంటారు .. సేవిస్తుంటారు. అయితే కొన్ని విశేషమైన రోజుల్లో ఆ తల్లిని ఆరాధించడం వలన, అమ్మవారు వెంటనే ప్రీతి చెందుతుంది. మనసులోని కోరికలు తెలుసుకుని, అనతికాలంలోనే అవి నెరవేరేలా చేస్తుంది.
అమ్మవారు అలా అధికంగా ప్రీతిచెందే రోజుగా, ఆశ్వయుజ తదియ చెప్పబడుతోంది. ఈ రోజునే 'అట్లతద్ది' అనీ, 'చంద్రోదయ వ్రతం' అని అంటారు. ఈ రోజున ఉదయాన్నే స్త్రీలు తలంటుస్నానం చేసి, గౌరీదేవిని ప్రతిమను ప్రతిష్ఠించుకుని పూజించాలి. ఆ రోజున సాయంత్రం వరకూ ఉపవాస దీక్షను చేపట్టి, చంద్రోదయం అయిన తరువాత పది అట్లు పోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి.
పదిమంది ముత్తయిదువులను పిలిచి, ఒక్కొక్కరికి పది అట్లు .. దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వవలసి ఉంటుంది. ఇలా అట్ల తదియ రోజున ఉమాదేవిని పూజించడం వలన వివాహం .. సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.