కరుణించే కనకదుర్గమ్మ
కనకదుర్గమ్మ తల్లి పేరు వినగానే ఎవరికైనా విజయవాడ గుర్తుకువస్తుంది. అక్కడి స్థలమహాత్మ్యం గురించిన విశేషాలు గుర్తుకువస్తాయి. ఆ తల్లి లీలావిశేషాలు అనేకమంది భక్తుల అనుభవాలుగా వినిపిస్తాయి. అందువల్లనే చాలా ప్రాంతాల్లోని భక్తులు ఆ తల్లిని అనునిత్యం దర్శించే భాగ్యం కోసం, ఆలయాన్ని నిర్మింపజేసుకుని ప్రేమగా ప్రతిష్ఠ చేసుకున్నారు.
అలా అమ్మవారు కొలువైన ఆలయాల్లో ఒకటిగా హైదరాబాదు - వనస్థలిపురంలోని కనకదుర్గ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడి ప్రశాంత్ నగర్ లోని ఈ ఆలయం రెండు అంతస్తులుగా కనిపిస్తూ ఉంటుంది. పై అంతస్తులోని గర్భాలయంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. సకల శుభాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అమ్మవారి మూలమూర్తి కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది.
ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. అమ్మవారిని పూజించడం వలన అనారోగ్యపరమైన . . ఆర్ధికపరమైన సమస్యలు తీరిపోతాయనీ, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారి దర్శనంతో ఆరంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని అంటారు. విశేషమైన పర్వదినాల్లో అమ్మవారికి జరిపే ఉత్సవాల్లో భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆ తల్లికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు.