శ్రీ లలితాదేవి ఆరాధన ఫలితం!
లోక కల్యాణం కోసం అమ్మవారు ధరించిన విశేషమైన రూపాలలో ఒకటిగా 'శ్రీ లలితా త్రిపురసుందరి' చెప్పబడుతోంది. దేవీ నవరాత్రులలో మొదటి రోజున బాలా త్రిపుర సుందరినీ .. రెండవ రోజున గాయత్రీదేవిని .. మూడవ రోజున అన్నపూర్ణమ్మ తల్లిని .. నాల్గవ రోజున మహాలక్ష్మీ దేవిని .. ఐదో రోజున అంటే 'ఆశ్వయుజ శుద్ధ పంచమి' రోజున లలితా త్రిపుర సుందరిని పూజిస్తారు.
ఈ రోజున అమ్మవారి ఆలయాలలో ఆ తల్లిని లలితా త్రిపురసుందరిగా అలంకరించి .. దర్శించి తరిస్తుంటారు. సాధారణ రోజుల్లో చేసిన లలితా సహస్రనామ పారాయణం ఆశించిన ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అలాంటిది అమ్మవారు ఈ రూపాన్ని ధరించిన ఈ రోజున ఈ పారాయణం చేయడం వలన ఫలితం విశేషంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆరాధన ఫలితం అన్ని కష్టాల నుంచి విముక్తిని చేస్తుందని స్పష్టం చేస్తున్నాయి.
ఇక కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున 'ఉపాంగ లలితా వ్రతం' ఆచరిస్తూ ఉంటారు. సూర్యోదయానికి చవితి వుండి .. రాత్రికి పంచమి ఉండటం ఈ వ్రత ఆచరణకి ముఖ్యమని చెప్పబడుతోంది. ఈ రోజున అమ్మవారి భజనలు చేస్తూ జాగరణ చేయడం వలన, ఆ తల్లి కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు చేకూరతాయి.