దేవీనవరాత్రులు ప్రారంభం
ఆశ్వయుజ మాసం .. చాంద్రమానాన్ని అనుసరించి ఇది ఏడవ మాసం. పౌర్ణమి రోజున అశ్వనీ నక్షత్రం ఉండటం వలన, ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. ఈ మాసంలో దేవీపూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ జరిగే నవరాత్రులను 'దేవీ నవరాత్రులు'గా .. 'శరన్నవరాత్రులు'గా పిలుస్తుంటారు.
ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది.
ఈ నవరాత్రుల సమయంలో వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు .. పూలు .. పండ్లు .. చీరసారెలు సమర్పిస్తూ వుంటారు. కుమారీ పూజలు .. సువాసినీ పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.