అంతర్వేది లో అడుగుపెడితే చాలు!

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో 'అంతర్వేది' ముందువరుసలో కనిపిస్తుంది. సముద్రంలో గోదావరి కలిసే ప్రదేశంలో వెలసిన ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా .. మరెంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. వశిష్ఠ మహర్షి కోరికమేరకు లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువుదీరాడని స్థలపురాణం చెబుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు సమస్త పాపాలు .. దోషాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

త్రేతాయుగంలో రావణుడి సంహారం అనంతరం, ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి గాను శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించాడట. ఇక ద్వాపర యుగంలో అర్జునుడు దోష పరిహారార్థం తీర్థయాత్రలు చేస్తూ .. ఈ క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడని ప్రతీతి. బ్రహ్మదేవుడు సైతం తనకి గల గోహత్య పాతకం నుంచి బయటపడటానికి ఈ క్షేత్ర దర్శనం చేశాడట.

ఈ ప్రదేశాన్ని వేదికగా చేసుకుని ఆయన యజ్ఞాలు చేయడం వల్లనే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ దర్శనమిచ్చే పార్వతీ నీలకంఠుడు ఆయన ప్రతిష్ఠయేనని చెబుతారు. మహర్షి భక్తికి మెచ్చి వెలసిన స్వామి .. దేవతల పాపాలను సైతం కడిగిన స్వామి .. రాజుల దోషాలను సైతం తొలగించిన స్వామి .. భక్తుల కోరికలను నెరవేర్చే స్వామి కొలువైన ఈ విశిష్టమైన క్షేత్రంలో అడుగు పెట్టడమే అదృష్టం. ఆ క్షేత్ర ప్రవేశంతోనే సమస్త పాపాలు నశిస్తాయి .. సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి.


More Bhakti News