వరాల నొసగే ఉమామహేశ్వరుడు

ఉమా .. అనే నామాన్ని స్మరించినంత మాత్రాన్నే సమస్త పాపాలు నశించి, పునర్జన్మ లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి ఉమాదేవి సమేతంగా మహేశ్వరుడు కొలువైన క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా అలరారుతున్నాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా 'ఉమ్మెడ' కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

ఉమాదేవి సమేతంగా స్వామి దర్శనమిస్తూ ఉన్న కారణంగానే ఈ ఊరుకి ఈ పేరు వచ్చిందని అంటారు. వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠ చేస్తూ వెళ్లాడు. అలాంటి విశిష్టమైన శివలింగాలలో ఇది ఒకటిగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి శివ లింగంపై మూడవ కన్ను కనిపిస్తూ ఉండటం విశేషం.

దాంతో ఈ ప్రదేశంలో రాముడికి శివుడు ప్రత్యక్ష దర్శనమిచ్చి, ఆ తరువాత లింగాకృతిని పొందాడని అంటారు. స్వామివారి పక్కనే అమ్మవారి మూలమూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఎంతోమంది మహర్షులు .. మహారాజులు ఇక్కడి స్వామిని దర్శించి .. పూజించి తరించారని చెబుతుంటారు. ఉమామహేశ్వరుడిని ఆరాధించడం వలన, వివిధ రకాల వ్యాధులు .. బాధలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయురారోగ్యాలు .. సంతాన సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భావిస్తుంటారు.


More Bhakti News