భగవంతుడు సహించలేనిది అదే!
భగవంతుడిని పూజించకపోయినా .. సేవించకపోయినా ఆయన ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ తన భక్తులకు ఎవరైనా ద్రోహం తలపెట్టాలని చూస్తే మాత్రం ఆయన అస్సలు సహించలేడు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి భక్తుడైన జయదేవుడికి హాని తలపెట్టడానికి ప్రయత్నించిన కొంతమంది దొంగలు కూడా ఆ స్వామి ఆగ్రహానికి గురైన తీరు ఇందుకు మరో ఉదాహరణగా కనిపిస్తుంది.
జయదేవుడు ఏ రాజు ఆశ్రయంలోనైతే ఉన్నాడో, ఆ రాజు ఆస్థానానికి కొంతమంది దొంగలు పండితుల వేషంలో వస్తారు. వాళ్లని చూడగానే .. గతంలో తనని గాయపరిచి .. తన దగ్గర వున్న ధనాన్ని కాజేసినది వాళ్లేనని జయదేవుడు గ్రహిస్తాడు. వాళ్లు కూడా ఆయనని గుర్తుపట్టి .. కంగారును కప్పిపుచ్చుకుంటారు.
తమ గురించి రాజుగారితో జయదేవుడు ఏమైనా చెప్పేస్తాడేమోనని భయపడి, వాళ్లే ఆయన గురించి రాజుగారికి లేనిపోనివి కల్పించి చెప్పడం మొదలుపెడతారు. జయదేవుడు మౌనంగా ఉన్నా ఆయన సేవలందుకునే ఆ భగవంతుడు మాత్రం సహనంతో ఉండలేకపోతాడు. ఆ క్షణమే ఆ దొంగల ప్రాణాలను హరించి వేస్తాడు. నిస్వార్ధంతో .. నిర్మలమైన మనసుతో తనని సేవించే భక్తులను ద్వేషించేవారిని .. దూషించేవారిని శిక్షించడానికి భగవంతుడు ఎంతమాత్రం ఆలస్యం చేయడనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.