శివాలయంలో దీపం వెలిగిస్తే చాలు
పరమశివుడిని అనుదినము అభిషేకించాలి .. ఆరాధించాలి. అందుకు వీలుకుదరని పక్షంలో సోమవారం రోజునైనా ఆయనని సేవించాలి. శివయ్యకి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. సోమవారం రోజున చేసే శివపూజ అధిక ఫలాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ స్వామిని సోమవారం కూడా పూజించలేకపోయినవారికి, 'మాస శివరాత్రి' పేరుతో ఆయన మరో అవకాశం ఇచ్చాడు.
మాస శివరాత్రి మహా శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించడం వలన, మాసమంతా స్వామిని సేవించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. శివుడు ప్రదోష వేళలో (సాయం సమయంలో) ఆనంద తాండవం చేస్తూ ఉంటాడనీ, ఆ సమయంలో సమస్త దేవతలు అక్కడికి చేరుకుంటారనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయనని పూజించడం వలన మరింత విశేషమైన ఫలితం చేకూరుతుంది.
అందువలన మాస శివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేపట్టి .. ప్రదోష వేళలో శివుడిని ఆరాధించి .. ఆయన లీలావిశేషాలను స్మరిస్తూ .. స్తుతిస్తూ జాగరణ చేయవలసి ఉంటుంది. ఇక ఈ రోజున శివాలయానికి వెళ్లి అక్కడ దీపాన్ని వెలిగించడం ముఖ్యమైనది. శివుడి సన్నిధిలో దీపం వెలిగించడం వలన, సమస్త పాపాలు .. దోషాలు నశించి .. అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.